
ఇళ్లపై పడకూడదంటే..
ఖలీల్‌వాడి: మండుటెండల వేడిమి చల్లారక ముందే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ పిడుగులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిడుగుల కారణంగా ప్రతి యేటా వందలాది మంది చనిపోతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు పడటంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈనేపథ్యంలో వర్షాకాలంలో పిడుగుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నివారించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పిడుగులు ఏర్పడేది ఇలా..
పిడుగు అనేది ఆకాశంలో ఏర్పడే విద్యుత్ ఉత్సర్గం. సాధారణంగా మేఘాల మధ్య సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు ఆవిరై మేఘాలు ఏర్పడినప్పుడు, వాటిలో ధనావేశిత, రుణావేశిత కణాలు ఏర్పాడుతాయి. ఈ కణాలు ఒకదానితో ఒకటి ఆకర్షించబడుతాయి. ఇలా ఆకర్షణ జరిగినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడి, మెరుపు, ఉరుములతో కూడిన పిడుగు భూమిని తాకుతుంది. పిడుగు పడిన వద్ద వేల డిగ్రీల వేడి ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు పిడుగు పడితే ఆరుబయట ఉన్నప్పుడు భూమిపై కూర్చుండాలి. పిడుగు పడే సమయంలో ఎక్కువ శబ్దం వస్తుంది. కావున ఆ సమయంలో చెవులు మూసుకోవాలి.
● రైతులు వర్షాలు పడేసమయంలో బోరుబావుల వద్దకు, మోటర్లు వద్దకు వెళతారు. అలాంటి సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. సెల్‌ఫోన్లు వాడకూడదు.
● ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు ఇంటి పైకప్పుపైన గాని, బయట ఉండకూడదు. వ్యవసాయక్షేత్రాలు, బయట పనిచేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం చేయరాదు. చెరువులు, కుంటలకు దూరంగా ఉండాలి.
● టవర్లు, చెట్లు, కరెంట్ స్తంభాలు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలి. ఎత్తైన ప్రదేశాలు పిడుగులను ఆకర్షిస్తాయి. వర్షం పడుతున్నప్పుడు సమీపంలో ఉండే ఇంటిలోకి వెళ్లాలి.
● ట్రాన్స్‌ఫార్మర్స్, విద్యుత్ సబ్‌స్టేషన్లకు దూరంగా ఉండాలి. ఎలక్ట్రికల్ వస్తువులైన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, విద్యుత్ వైర్ల వద్ద ఉండవద్దు.
ఇళ్లపై పిడుగులు పడితే ఇంట్లోని విద్యుత్ పరికరాలు, సామగ్రి కాలిపోవడంతోపాటు, ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ఇళ్లపై పిడుగులు పడకూడదంటే ఇంటికి ‘లైట్నింగ్ అరెస్టర్’ను ఏర్పాటు చేసుకోవాలి. ఎత్తైన భవనాలకు దీనిని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మేఘాలు వేగంగా రావడంతోనే పిడుగులు..
వర్షాకాలం ప్రారంభంలో మేఘాలు వేగంగా ప్రయాణించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. పిడుగులు పడే సమయంలో వ్యవసాయక్షేత్రాలతోపాటు ఆరుబయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఇళ్లు, వ్యాపార సముదాయాల దగ్గర తప్పనిసరిగా ఎర్తింగ్ పెట్టుకోవాలి. పిడుగులపై చిన్న నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంటుంది.
– జి పరమేశ్వర్, జిల్లా అగ్నిమాపకశాఖ
అధికారి, నిజామాబాద్

ఇళ్లపై పడకూడదంటే..