న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు కీలక స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
అసోం లోక్‌సభ స్థానం ఇలా..
నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవాశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. దేవాశిష్ శర్మకు ఇప్పటి వరకు 230625 ఓట్లు రాగా.. 68484 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. AIUDF అభ్యర్థి బద్రుద్దీన్ అజ్మల్‌కు 162141 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి శివమోని బోరాకు 40104 ఓట్లు వచ్చాయి.
బెంగాల్‌లో బీజేపీ ముందంజ
నందిగ్రామ్: బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై సుమారు 50వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తాజా వార్తా నివేదికలు పేర్కొన్నాయి
రెజీనగర్: బీజేపీ అభ్యర్థి శంఖరవ్ సర్కార్ ప్రత్యర్థి గులాం నబీ ఆజాద్‌పై సుమారు 41వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.
ఆధిక్యంలో టీవీకే..
ధారాపురం: 12 రౌండ్ల లెక్కింపు తర్వాత TVK అభ్యర్థి పి. సత్యభామకు 34987 ఓట్లు వచ్చాయి. డీఎంకే అభ్యర్థి ఎస్. సుగన్యకు 28567 ఓట్లు నమోదయ్యాయి. అన్నాడీఎంకే అభ్యర్థి కె. బానుమతికి 25307 ఓట్లతో కొనసాగుతున్నాయి. మొత్తంగా టీవీకే అభ్యర్థి 6420 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
మదురాంతకం: ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి TVK అభ్యర్థి మరగతం కుమరవేల్‌కు 30,785 ఓట్లు వచ్చాయి. డీఎంకే అభ్యర్థికి 20,449 ఓట్లు, అన్నాడీఎంకే అభ్యర్థికి 17,543 ఓట్లు నమోదయ్యాయి. డీఎంకేపై మరగతం కుమరవేల్ 10,336 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


