
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే..
జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్‌మెంట్‌లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.
గతంలో ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!

పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్‌పూర్, కౌశంబి, ప్రతాప్‌ఘడ్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.

2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్‌లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి.
ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్‌లో బాగా వైరల్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది.
భర్త భరణానికి అర్హుడేనా?
హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.
ప్రొఫెషనల్‌గానూ..
వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్‌కు ఆమె జనరల్ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం.