తెలంగాణ చరిత్రలో కేసీఆర్ స్థానం సుస్థిరం
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టమని, ఆరు దశాబ్దాల కలను సాకారం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోషించిన పాత్ర తిరుగులేనిదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారు శనివారం బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ 2001లో ఉద్యమాన్ని పునర్నిర్మించడం నుంచి 2014లో రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్ అసమాన పోరాటం చేశారని కొనియాడారు. అనంతరం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు, ఉద్యమకారులతో కలిసి అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి, అమరులకు నివాళులర్పించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ దీక్ష దివాస్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విజయ్‌సాగర్, భీమయ్యగౌడ్, కన్నాజగదీశ్, వేపూరిరాములు తదితరులు పాల్గొన్నారు.


