‘ఉద్యోగంలో అందించిన సేవలే గుర్తుంటాయి’
నారాయణపేట: ప్రతి ఉద్యోగికి విరమణ అనేది తప్పనిసరి అని, కానీ వృత్తి రీత్యా చేసిన సేవలే గుర్తుండి పోతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీపీఓ యోగానంద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడాది పాటు నుంచి సీపీఓతో కలిసి తాను పని చేశానని, పేట లాంటి రిమోట్ జిల్లాలో పని చేసేందుకు చాలా మంది అధికారులు కొంత సంశయిస్తుంటారని తెలిపారు. కానీ ఎంతో ఒత్తిడితో కూడిన ముఖ్య ప్రణాళిక శాఖలో సీపీఓగా యోగానంద్ పాజిటివ్ మైండ్ సెట్‌తో పని చేశారని గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సీపీఓ యోగానంద్ దంపతులను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మొగులప్ప, డీపీఆర్‌ఓ రషీద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్‌ఖలీల్, ఏఓ శ్రీధర్, జయసుధ, డిప్యూటీ సీపీఓ శ్రీదేవి, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


