మిల్లర్ల దోపిడీపై రైతుల ఆందోళన
మరికల్: ధన్వాడ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అక్రమాలను నిరసిస్తూ రైతులు శనివారం అప్పంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర లారీలను ఆపి ఆందోళన చేశారు. ఈ నెల 25న అప్పంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర 7 మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని తూకం వేయగా 796 బస్తాల ధాన్యం కాగా, 318.40 క్వింటాళ్లు వచ్చింది. అయితే లారీ డ్రైవర్ కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు తీసుకెళ్లి అక్కడ వే బ్రిడ్జి తూకం వేయగా 796 బస్తాలకు బదులు 786 బస్తాల ధాన్యం వచ్చినట్లు ట్రాక్‌సిట్ తెచ్చి రైతులకు ఇచ్చాడు. తూకంలో 10 బస్తాల ధాన్యం తక్కువ రావడంపై ఆగ్రహించిన రైతులు మిల్లు యాజమానిని నిలదీయగా దురుసుగా మాట్లాడాడు. కష్టపడి పండించిన ధాన్యంను మిల్లర్లు దోచుకుంటున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన సివిల్ సప్లయ్ డీఎం సైదులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.


