ఆరోగ్య బీమా జీవితానికి ధీమా
నారాయణపేట: ఆరోగ్య, ప్రమాద బీమా ప్రతి ఒక్కరికి ధీమానిస్తుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్‌హక్ అన్నారు. ఎస్పీ డా. వినీత్ సూచన మేరకు బుధవారం హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్‌లకు ఆరోగ్య, ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో బీమా అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమన్నారు. ఏదైనా అనుకోని ఘటనలు జరిగినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా ఇలాంటి బీమాలు దోహదపడుతాయన్ని తెలిపారు. అలాగే ఆర్థిక భద్రతపై దృష్టి సారించాలని, యాప్‌లలో రుణాలు తీసుకొని ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ బీమా ఎంచుకోవడంతో కుటుంబ సభ్యులకు ధీమా కలిగి ఉంటుందని తెలిపారు. సంబంధిత బ్యాంకు అధికారులు మాట్లాడుతూ.. బ్యాంకులో ఖాతా ఉన్న సిబ్బంది ఏటా రూ.11,650 ప్రీమియం చెల్లిస్తే కుటుంబంలోని నలుగురికి రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుందని తెలిపారు. అలాగే బ్యాంకులో వేతన అకౌంట్ కలిగి ఉండి ప్రతినెల డెబిట్ కార్డు వినియోగిస్తే ప్రమాదవశాత్తు మృతిచెందితే బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ప్రమాద బీమా అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో హోంగార్డు ఇన్‌చార్జ్, ఆర్‌ఎస్‌ఐ మద్దయ్య, ఆర్‌ఎస్‌ఐలు శ్వేత, శిరీష, పాల్గొన్నారు.


