
మెరుగైన వైద్యం అందించాలి
నారాయణపేట: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తేనే.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం, భరోసా కలుగుతాయని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తాలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పలు రికార్డులతో పాటు మందుల స్టాక్ తదితర వాటిని పరిశీలించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ నరసింహారావుకు సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, బోధన తీరును పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన ఆట వస్తువులు, బోధనా పరికరాలతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు.
ఉర్దూ పాఠశాల భవనం మార్చాలని ఆదేశం..
దూల్‌పేటలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్న హాజిఖాన్‌పేట ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ 25 మంది విద్యార్థులు ఉండగా.. కొన్నేళ్లుగా అద్దె భవనంలో పాఠశాల కొనసాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అయితే ఉర్దూ మీడియం పాఠశాలను వెంటనే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని ప్రాథమిక పాఠశాల భవనంలోకి మార్చాలని ఎంఈఓ బాలాజీని అదనపు కలెక్టర్ ఆదేశించారు.