
రూ.5.23 కోట్లతో 343 ప్రకృతి వనాలు
మద్దూరు: పర్యావరణ పరిరక్షణతోపాటు.. గ్రామాల్లో చిన్నారులు, పెద్దలకు ఆహ్లాదం పంచడానికి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో దర్శమిస్తున్నాయి. ప్రకృతి వనాల చుట్టూ ముళ్ల కంచెలు పూర్తిగా ధ్వంసమై పోవడంతో పశువులు సంచరిస్తున్నాయి. కొన్ని పార్కుల్లో సేద తీరేందుకు ఏర్పాటు చేసినా సిమెంట్ కుర్చీలు, బల్లాలు విరిగిపోయాయి. అక్కడక్కడా ఊరికి ఆనుకుని ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లోనే కొంత సందడి కనిపిస్తున్నా.. మెజార్టీ గ్రామాల్లో ఊరికి దూరంగా కిలోమీటర్ల దూరంలో పార్కులను ఏర్పాటు చేయడంతో అటువైపు ఎవరూ వెళ్లడమే లేదు. ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ఈ వనాలు ఉపయోగపడకపోవడంతో రూ.లక్షల నిధులు వృథా అయ్యాయి. కొందరు వీటిని అసాంఘిక కార్యకలాలపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
జిల్లాలో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా 2021లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని అప్పటి 11 మండలాల్లో మొత్తం 343 పల్లె ప్రకృతి వనాలను రూ. 5.23 కోట్లతో ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం 5 ఎకరాల పైనా ఉన్న గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను 28 వరకు ఏర్పాటు చేశారు. ఈ వనాల ఏర్పాటు కోసం ఉపాధి హామీ పథకం నుంచి రూ.97.33 లక్షలు వెచ్చించారు. పల్లె ప్రకృతి వనాలలో వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచె మొక్కలు, ఓపెన్ జిమ్ లాంటివి ఏర్పాటు చేశారు. మొక్కలను పెంచడానికి ఒక వాచర్‌ను కూడా నియమించారు. రెండేళ్ల తర్వాత నిర్వహణ మొత్తం జీపీలకు అప్పగించారు.
ఇది మద్దూరు మండలంలోని దోరేపల్లి గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం. ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో గుట్టల్లో నిర్మించారు. అప్పట్లో మొత్తం 460 మొక్కలను నాటారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసి గేటు అమర్చారు. అయితే ఊరికి దూరంగా ఉండడంతో ప్రజలెవరూ ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కొంత కాలం క్రితం ఇనుప కంచెను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రస్తుతం గేటు, చుట్టూ సిమెంట్ దిమ్మెలు మాత్రమే ఉన్నాయి. అందులో నాటిన మొక్కలు ఒక్కటీ లేవు. ఈ మధ్య కాలంలో వర్షాలు పడడంతో
ప్రకృతి వనం మొత్తం పిచ్చిమొక్కలు మొలిచాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరికొన్ని రోజుల్లో గేటు, సిమెంట్ దిమ్మెలను కూడా దొంగిలించే అవకాశం లేకపోలేదు.
నిధుల కొరతతో..
గత కొంత కాలంగా గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి. వేసవి కాలంలో వీటిని పట్టించుకోకపోవడంతో వనాల్లో మొక్కలు ఎండిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వీటి నిర్వహణ చేపట్టి కొత్త మొక్కలను నాటి అంబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. కొన్నిచోట్ల పల్లె ప్రకృతి వనాలు కబ్జాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
నిర్వహణ మరిచారు..
ఊరికి దూరంగా పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించడంతో ఎందుకు పనికిరాకుండా పోయింది. ఊరికి సమీపంలో నిర్మించి ఉంటే దాన్ని నిర్వహణ చేపట్టపోయినా అడిగేవాళ్లం. 2 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో అక్కడి వెళ్లలేకపోతున్నాం. ప్రకృతి వనం చుట్టూ ఏర్పాటు చేసిన కంచె ఎవరో ఎత్తుకెళ్లారు. కొన్ని రోజులైతే గేటు కూడా తీసుకెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు మొక్కలు నాటి, నిధులు మంజూరు చేసి పక్కాగా నిర్వహణ చేపట్టాలి.
– శ్రీనివాస్‌గౌడ్, దోరేపల్లి
కొత్త మొక్కలు నాటుతాం..
జిల్లాలో ఏర్పాటు చేసినా పల్లె, బృహత్ ప్రకృతి వనాలు ఊరికి దగ్గర ఉన్నవి బాగున్నాయి. ఊరికి దూరంగా ఉన్నవి అక్కడక్కడ నిర్వహణ లేకపోవడంతో పాడైన మాట వాస్తవం. మా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పంచాయతీ సిబ్బందిచే బాగుచేయిస్తున్నాం. ఎండిన మొక్కల స్థానంలో ఈ వర్షాకాలంలో కొత్తవాటిని నాటుతాం. మొక్కలు ఎండకుండా విధిగా నీరు అందిస్తాం. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. – సుధాకర్‌రెడ్డి,
ఇన్‌చార్జ్ డీపీఓ, నారాయణపేట

రూ.5.23 కోట్లతో 343 ప్రకృతి వనాలు

రూ.5.23 కోట్లతో 343 ప్రకృతి వనాలు

రూ.5.23 కోట్లతో 343 ప్రకృతి వనాలు