
‘ఎమర్జెన్సీ చీకటి ఘట్టం’
నారాయణపేట రూరల్: యాబై ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ కాలం దేశ ప్రజలకు చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ అన్నారు. బుధవారం నారాయణపేటలో బిజెపి వికారాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ పి.శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కె.సత్య యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అధికార దాహంతో కోర్టు తీర్పును అపహస్యం చేస్తూ ఒక్క కలం పోటుతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. ఎందరో నాయకులు, ప్రముఖులను అరెస్ట్ చేయించి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించి తూట్లు పొడిచారని అన్నారు. చివరకు పత్రికా స్వేచ్ఛను కాలరాసిందని విమర్శించారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గల్లంతై ఇందిరాగాంధీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేక పోయిందని అన్నారు. ఎమర్జెన్సీతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి బుద్ది చెప్పారని అన్నారు. నేడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు గుర్తించి కాంగ్రెస్ కు ప్రతి ఎన్నికల్లో బుద్ది చెప్పారని అన్నారు.