కోస్గి: స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.శైలజ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, స్కానింగ్ సెంటర్లలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ఆస్పత్రుల్లో వైద్యుల అర్హత ధ్రువపత్రాలతో పాటు రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఫీజులపై ఆరా తీశారు. స్కానింగ్ సెంటర్లలో పరీక్షలకు సంబంధించిన ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే స్కానింగ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంట ఇన్‌చార్జి డెమో అధికారి శ్రీనివాస్ ఉన్నారు.
విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
నారాయణపేట: ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న ధర్నాకు సంబంధించి మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భగత్‌సింగ్ భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో 6శాతం నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. 2025 నాటికి 2.6శాతం నిధులతో సరిపెట్టిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీకి విరుద్ధంగా కేవలం 0.6శాతం నిధులు పెంచి 7.6 శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టే ధర్నాలో విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు రామకృష్ణ, వెంకటప్ప బాలరాజ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, రాము, కృష్ణ మారుతి, వసుంధర, అనిత పాల్గొన్నారు.
నేడు మార్కెట్‌కు సెలవు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం సెలవు కారణంగా ఉల్లి వేలం, ధాన్యం క్రయవిక్రయాలు జరగవని వ్యాపారులు తెలిపారు. బుధవారం అమావాస్య కావడంతో మార్కెట్ యార్డు బంద్ ఉంటుందని, దీనివల్ల ప్రతివారం జరిగే ఉల్లిపాయల బహిరంగ వేలం కూడా జరగదన్నారు. అయితే రైతులు నేరుగా వచ్చి మార్కెట్ బయ ట ఉల్లి విక్రయాలు కొనసాగించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో తిరిగి గురువారం క్రయవిక్రయాలు కొనసాగుతాయి.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు