
నారాయణపేట బంద్ సంపూర్ణం
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని అర్ధాంతరంగా అప్పక్‌పల్లి సమీపంలో ఉన్న మెడికల్ కళాశాల భవనంలోకి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట బంద్ విజయవంతమైంది. బీజేపీ జిల్లాశాఖ పిలుపు మేరకు వ్యాపారులు, ప్రజలు బంద్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఉదయం 6 గంటలకే ఆర్టీసీ డిపో ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి.. ఒక బస్సు కూడా డిపో నుంచి కదలకుండా ధర్నా చేపట్టారు. జిల్లా ఆస్పత్రిని యథా స్థానంలో ఏర్పాటు చేసేంత వరకు తమ ఆందోళన ఆగదని నినాదాలు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా ఆర్టీసీ బస్టాండ్‌లోనే కూర్చున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు కొండా సత్యయాదవ్, పట్టణ అధ్యక్షుడు వినోద్, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ నందు నామాజీ, కేంద్ర సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్, రఘురామయ్యగౌడ్, సిద్ధి వెంకట్రాములు, మిర్చి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.