
మాదకద్రవ్యాలతో భవిష్యత్ అంధకారం
మక్తల్: మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మక్తల్ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి అత్యంత కీలకమైనదన్నారు. ఈ సమయంలో మత్తుకు బానిస కావొద్దన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద కొందరు చాకెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని.. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో అందరి సహకారంతో మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే 1908 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎకై ్సజ్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, డీవైఎస్‌ఓ వెంకటేశ్ శెట్టి, ఎంఈఓ అనిల్‌గౌడ్, ప్రిన్సిపాల్ రాములు పాల్గొన్నారు.