
శిథిలావస్థలో పాఠశాలలు
మక్తల్/దామరగిద్ద: మక్తల్ పట్టణంలోని బీసీకాలనీలో, మండలంలోని టేకులపల్లి, సోమేశ్వర్ బండ, ఉప్పర్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదులు నెర్రలుబారడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. భూత్పూర్ గ్రామంలోని పాఠశాల రిజర్వాయర్‌కు దగ్గరగా ఉండడం.. ప్రహరీ లేకపోవడంతో పాములు, విష పురుగులు తరచూ పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. అలాగే, తీర్యాలపూర్‌లోనూ ప్రభుత్వ పాఠశాల వ్యవసాయ పొలాలకు సమీపంలో ఉండడంతో పాముల బెడద తీవ్రమై విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
● దామరగిద్ద మండలంలోని తండా పాఠశాలలో కేవలం రెండు గదుల్లో 5వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో 34 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు పెచ్చులూడిపడుతున్నాయి. విద్యార్థులు ప్రమాదపు అంచుల్లో చదువులు కొనసాగిస్తున్నారు.