వార్షిక ఆదాయ లక్ష్యాలు అధిగమించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల: జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎకై ్సజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్ , రవాణా విభాగాలు కేటాయించిన లక్ష్యాలను వంద శాతం అధిగమించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదాయ వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్యసాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చేపట్టిన అంశాలపై తరచూ సమీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. ఎకై ్సజ్ శాఖ గత ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు రూ.596.63 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి 7.14 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందన్నారు. మిగతా నెలల్లో కూడా అదే స్థాయిలో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్‌కు సూచించారు. మైనింగ్‌శాఖ లక్ష్యం రూ.530 కోట్లు ఉండగా నవంబర్ వరకు రూ.143 కోట్లు మాత్రమే సాధించిందన్నారు. వెంటనే లోపాలను సరిచేసుకొని చెక్‌పోస్టులను బలోపేతం చేసుకోవాలన్నారు. నిలిచిపోయిన 102 మైనింగ్ యూనిట్లను పునఃప్రారంభిస్తే ఆదాయ వనరులు సమకూరుతాయన్నారు. అలాగే వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర శాఖలు కూడా ఆదాయాలను వృద్ధి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్‌ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.


