
నెరవేరని సేంద్రియ ఎరువుల తయారీ విధానం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను తరలించేందుకు పట్టణ శివారులో గల రాంనగర్ బంధం వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డుకు ప్రస్తుతం దిక్కు, మొక్కు లేకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. వివిధ ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలు కూడా వీటిలో పడేయడంతో దుర్వాసన వస్తోంది. కలుషిత వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో రాంనగర్, బంధం, ఈదులగూడెం ఏనే, బాధలాపురం, గుడూరు, అవంతిపురం, ఈదులగూడెం వరకు పొగ కమ్ముకుంటుంది. తడి చెత్త, పొడి చెత్తను సేకరించడంతో పాటు డంపింగ్ యార్డులోని సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు ‘వేస్ట్ వెంచర్’ సంస్థ 2013లో ముందుకు వచ్చింది. ఆ సంస్థ నిర్వాహకులు సెగ్రిగేషన్ చేసి విండ్రోస్ విధానంతో థర్మోఫిలిక్ ఆర్గానికి కంపోస్ట్ ద్వారా ఎరువులు తయారు చేశారు. రెండేళ్ల పాటు బాగానే నడిచినా.. తీరా ఆ సంస్థ చేతులెత్తేసింది.
దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం
డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడం ద్వారా వెలువడుతున్న పొగ ఇళ్లను కమ్ముకుంటుంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో తట్టుకోలేకపోతున్నాం. ఇళ్లలో ఉండలేకపోతున్నాం. ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించారు.
– మలిఖార్జున్, 4వ వార్డు, ఈదులగూడెం