
శరవేగంగా నెల్లికల్లు ఎత్తిపోతల పనులు
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : నెల్లికల్లు ఎత్తిపోతల పనులు శరవేగంగా సాగుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మొత్తం 11 గ్రామాల్లోని 24,624 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె నెల్లికల్ ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్, పైపులైన్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షం వల్ల పనులు ఆగిపోకుండా ముందే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులను భద్రతను సైతం దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రెస్సర్ మెయిన్(పైప్‌లైన్)కు సంబంధించి భూసేకరణ అవార్డు పాస్ చేసి.. చెల్లింపులు చేస్తున్నామన్నారు. కెనాల్‌కు సంబంధించి సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మిర్యాలగూడెం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ప్రాజెక్టు డీఈ సీతారాం, ఏఈ రవి, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి