
రోడ్డు పక్కన దుర్గంధం
కొండమల్లేపల్లి : పారాబాయిల్డ్ రైస్ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం కూడా రోడ్డు పక్కన నిలవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామపంచాయతీలో ఓ రైస్ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం నిల్వ ఉండడంతో కొండమల్లేపల్లి నుంచి నల్లగొండకు వెళ్లే వాహనదారులకు విపరీతమైన దుర్వాసన రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వడ్లను ఉడకబెట్టిన నీరు మొత్తం కూడా ఇలా బయటికి వదలడంతో ఆ దుర్గందాన్ని భరించలేక వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సదరు మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.