
బడి బస్సుపై నిర్లక్ష్యం ఏలా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పాఠశాలల పునఃప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉన్నా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్‌నెస్ (సామర్థ్య) పరీక్షలు చేయించుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించి ఆర్టీఏ కార్యాలయం నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. గతంలో ఫిట్‌నెస్ లేకున్నా కొందరు బస్సులను నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారి ఆర్‌టీఏ అధికారులు మాత్రం ఫిట్‌నెస్ లేకుండా బస్సులు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఐదు రోజులే గడువు..
జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన బస్‌లను ముందుగానే ఫిట్‌నెస్ చేయించుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లాలో మొత్తం 706 బస్సులను ఆయా విద్యా సంస్థలు వినియోగిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 296 బస్సులను మాత్రమే పిట్‌నెస్ చేయించారు. ఇంకా 410 బస్సులు ఫిట్‌నెస్ చేయించుకోవాల్సి ఉంది. ఈ నెల 12న స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించుకోవడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది.
ఫ స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ చేయించుకోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు
ఫ పాఠశాలల పునఃప్రారంభానికి ముందే చేయించుకోవాలని నిబంధన
ఫ జిల్లాలో 706 బస్సులకు, 296 బస్సులకే ఫిట్‌నెస్
ఫ వీటిలో 15 ఏళ్ల గడువు దాటినవి 349 బస్సులు
ఫ వాటిని నడిపేందుకు వీల్లేందంటున్న ఆర్టీఏ అధికారులు
15 ఏళ్లు దాటితే నడపొద్దు
జిల్లాలోని స్కూల్ బస్సుల్లో 15 సంవత్సరాలు గడిచినవి 349 బస్సులు ఉన్నాయి. వాటిని ఫిట్‌నెస్ చేయడానికి అవకాశం లేదు. అవన్నీ ఉపయోగించడానికి వీల్లేదు. అవి కండీషన్‌లో ఉన్నా కాలపరిమితి తీరినందున నిబంధనల ప్రకారం వాటిని నడిపేందుకు అవకాశం లేదని ఆర్‌టీఏ అధికారులు చెబుతున్నారు.
ఫిట్‌నెస్ లేకుండా బస్సులు నడిపితే సీజ్ చేస్తాం
ఫిట్‌నెస్ లేకుండా బస్సులు నడిపితే సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం. పాఠశాలలు ప్రారంభం నాటికే బస్‌లు అన్ని ఫిట్‌నెస్ చేయించుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా నడిపే బస్సులను గుర్తించేందుకు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తాం. పిట్‌నెట్ లేకుండా బస్సులు నడపడానికి వీల్లేదు. – లావణ్య, ఎంవీఐ, నల్లగొండ