
ప్రతి చెంచుకు శాశ్వత గృహాలు
నాగర్‌కర్నూల్: ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని, చెంచుపెంటల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చెంచుల ఇళ్ల నిర్మాణాలు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్య, సదుపాయాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోహిత్ గోపిడితో కలిసి ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న చెంచులకు శాశ్వత గృహాల మంజూరు నిర్మాణానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెంచు పెంటల్లో ఇది వరకే గుర్తించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణాలు అత్యంత పారదర్శకంగా అమలుచేయాలన్నారు. చెంచులు ఎవరు కూడా శాశ్వత గృహాలు లేకుండా ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందని, అదే స్ఫూర్తితో జిల్లాలో అధికారులు పనిచేయాలన్నారు. అలాగే జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను గుర్తించడానికి ఒక్కొక్క వసతి గృహానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామన్నారు. ఆశ్రమ, గిరిజన వసతి గృహాలను తప్పనిసరిగా ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. చెంచు గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రిన్సిపల్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, అప్పాపూర్ చెంచు పెంటలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్‌ఎం ఆంజనేయులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నాలుగు జతల ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు, దుప్పట్లు, టవల్స్, ట్రంకు బాక్సులు, షూలు పంపిణీ చేశారా.. అని పాఠశాలల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర రెసిడెన్షియల్ గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే వసతులు, ఉపాధ్యాయుల హాజరు, భోజన సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు.