
వివరాలు 10లో u
దగ్గు, జలుబుతో సతమతం
●
● రోజుల తరబడి
తగ్గకపోవడంతో ఆందోళన
● రోగులతో కిటకిటలాడుతున్న
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు
● జాగ్రత్తలు పాటించాలంటున్న
వైద్య, ఆరోగ్యశాఖ
● ప్రైవేట్‌లో ఆర్థిక దోపిడీ
జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుతం విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, చికెన్ పాక్స్, శ్యాసకోస వ్యాధులు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. నెల రోజుల్లోనే ఈ కేసులు అధికంగా వచ్చాయి. సరైన సమయంలో ఆస్పత్రికి వచ్చే పిల్లలు త్వరగా కోలుకుంటున్నారు. నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
– తారాసింగ్,
అడిషనల్ డీఎంహెచ్‌ఓ, అచ్చంపేట
అప్రమత్తంగా ఉండాలి
దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. చాలారోజులుగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. కొత్త వేరియంట్లు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వైరస్ బారిన పడలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. జనరల్ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలే ఉన్నాయి.
– రఘు, జనరల్ ఆస్పత్రి
సూపరింటెండెంట్, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్ క్రైం/ అచ్చంపేట:
జిల్లాలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ప్రధానంగా టైఫాయిడ్, మలేరియా, చికెన్‌పాక్స్, శ్వాసకోస సంబంధ, డయేరియా కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఫిబ్రవరి రెండోవారం నుంచి సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని, వాతావరణ మార్పులతో పిల్లలు విషజ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం చల్లబడటం, చల్లని గాలులు వీయడం వంటి కారణాలతో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు దోమలు విజృంభించడంతో సమస్య తీవ్రమవుతుందని ప్రజలు భయపడుతున్నారు. దగ్గు, జలుబు సమస్య పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వైరల్ జ్వరం నాలుగైదు రోజుల్లో తగ్గుముఖం పడుతున్నా.. దగ్గు, జలుబు మాత్రం రెండు వారాలకు పైగా తీవ్రత చూపిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి ప్రతిరోజు 900 వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 150 నుంచి 200 వరకు జ్వరాలతో చిన్నపిల్లలు ఆస్పత్రికి వస్తున్నారు. నిత్యం 200కుపైగా రక్త నమూనాల పరీక్షలు చేస్తున్నారు. అయితే జ్వర పీడితుల్లో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయోంజా లక్షణాలు కనిపిస్తుండటం వల్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇష్టానుసారంగా పరీక్షలు
జిల్లాలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయోంజా కేసులు నమోదు కానప్పటికీ ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చేవారు జ్వర బాధితులు మాత్రమే ఉంటున్నారు. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలు జ్వరాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగుతీస్తున్నారు. గత 15 రోజులుగా ఏ ఆస్పత్రి చూసినా నిత్యం 100కు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిర్వాహకులు అవసరం ఉన్నా.. లేకున్నా రక్తం, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. అడ్డగోలుగా మందులు రాస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
లక్షణాలు ఇవే..
కరోనా వైరస్ సృష్టించిన అలజడిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో వేగంగా విస్తరిస్తున్న హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ను తేలికగా తీసుకోకపోవడమే మంచిది. ఈ వైరస్ వల్ల నిరంతరం దగ్గు, జ్వరం, జలుబు, శ్వాసకోస సమస్యలు ఉంటాయి. హెచ్1ఎన్1, హెచ్2ఎన్2, ఒమిక్రాన్ వైరస్ రూపంలో దీని వేరియంట్లు చాలా రకాలుగా ఉంటునట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు ఇతరులతో చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం, కలిసి భోజనం వంటివి చేయకూడదు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.

జనరల్ ఆస్పత్రిలో ఓపీ రాయించుకునేందుకు వేచి ఉన్న రోగులు

అచ్చంపేట అస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి

