
పంటల బీమా పునరుద్ధరణ?
● వానాకాలం నుంచి అమలుకు యోచనలో ప్రభుత్వం
● రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
నాగర్‌కర్నూల్: రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఆశించిన మేర పంట చేతికొచ్చి మంచి ధర పలికితే రైతులకు ఎంతో మేలు. కానీ కొన్నిసార్లు పండించిన పంట అకాల వర్షాలకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉండటంతో పంటల బీమా తప్పనిసరి అని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తిరిగి అమలు చేసే యోచనలో ఉంది.
2018 నుంచి నిలిపివేత..
పంటల బీమా పథకం రాష్ట్రంలో 2018 నుంచి అమలు కావడం లేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎలాంటి పరిహారం అందడం లేదు. బీమాను అమలు చేస్తే ప్రీమియం చెల్లించిన అన్నదాతలకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఏటా వానాకాలం, యాసంగిలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారు. ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పంటను బట్టి కొంత ప్రీమియం చెల్లిస్తే మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధానం ఉండేది. ప్రస్తుతం ఎలాంటి విధివిధానాలు అమలు చేస్తారో వేచి చూడాలి. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, బిజినేపల్లి, కొల్లాపూర్ ప్రాంతాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆయా మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా.. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నీరందక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలు, తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నా బీమా రక్షణ కవచంలా పని చేస్తుంది. దీంతో రైతులు ఈ పథకాన్ని అమలు చేయాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.