ప్రత్యేక పాలన
14
ఏళ్లుగా..
అధికారుల పాలనలో అభివృద్ధి శూన్యం
● కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం
● అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న గ్రామాలు
మంగపేట మండల కేంద్రం
మంగపేట: మంగపేట మండలం షెడ్యూల్డ్ అని గిరిజనులు.. కాదు నాన్ షెడ్యూల్డ్ అని గిరిజనేతరుల మధ్య నలుగుతున్న పంచాయితీ వీడడం లేదు. దాదాపుగా 14 ఏళ్లుగా ఈ మండల పరిధిలోని 25 గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సమస్యలను ఎవరూ సరిగా పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ఈసారి కూడా ‘పంచాయితీ’ తేలకపోవడంతో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది.
అసలు పంచాయితీ ఏమిటంటే..
మండలంలో ప్రస్తుతం 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిపై పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 2006లో అప్పటి 18 గ్రామాలకు నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ ప్రాంతంగా పరిగణిస్తూ అన్ని స్థానాలను ఎస్టీ రిజర్వేషన్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించారు. ఈ మండలం షెడ్యూల్డ్ పరిధిలోకి రాదని 2011లో గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిలుపుదల చేస్తూ కోర్టు స్టే ఇచ్చింది. అప్పటి నుంచి కోర్టుల్లో నలుగుతున్న ఇరువర్గాల పంచాయితీపై 05 జూలై 2023న గిరిజనులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గిరిజనేతరుల పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో 2011 నుంచి పంచాయతీ ఎన్నికలు ప్రతిసారీ వాయిదా పడుతూనే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో 14 ఏళ్లుగా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోనే పరిపాలనలో కొనసాగుతోంది.
ప్రజాధనం అవినీతిపరుల పాలు..
మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు లేకపోవడంతో గడిచిన 14 ఏళ్లు ప్రత్యేకధికారుల పాలనలో పంచాయతీల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన కోట్ల రూపాయల నిధులను కార్యదర్శులు మొదలుకుని మండల స్థాయి అధికారుల వరకు స్వాహా చేసిన ఆరోపణలున్నాయి. ఈ మండలంలో రూ.3 కోట్లకు పైగా కాజేసి సస్పెండ్ కూడా అయ్యారు. రూ.4 కోట్లకు పైగా పనులు చేయకుండానే చేసినట్లుగా రికార్డుల్లో చూపించి కాజేసినట్లు బహిరంగ రహస్యం.
అభివృద్ధికి ఆమడ దూరం
మండలంలో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం నిలిచిపోవడంతో ప్రజా ప్రతినిధులు అనే వారే లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రత్యేకధికారులు ఉత్సవ మూర్తుల్లా వ్యవహరించడం, పంచాయతీ కార్యదర్శుల్లో జవాబుదారీతనం లేక పోవడంతో పాటు గ్రామసభలు నిర్వహించకపోవడంతో పంచాయతీల అభివృద్ధికి నిధులు ఎంత వచ్చాయి, వాటిని దేనికి ఖర్చుచేశారనేది లెక్కాపత్రం లేకుండాపోయింది. మౌలిక వసతులపై అడిగేందుకు అధికారులు అందుబాటులో లేక పోవడంతో గ్రామాల్లో కనీసం వీదిలైట్ల ఏర్పాటు లేక పోవడం, తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది.
మండల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది
ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పంచాయితీ కారణంగా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో మండల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. స్థానిక ప్రజా ప్రతినిధులు లేక పోవడంతో ప్రజల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన, విద్య, వైద్యం, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, వీధిలైట్ల ఏర్పాటు అనేక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారమై ఎన్నికలు నిర్వహిస్తే మండల ప్రజలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది.
– గుగ్గిళ్ల సురేశ్, తెలంగాణ అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు మంగపేట
అధికారుల ఇష్టారాజ్యం
ప్రత్యేకధికారుల పాలనలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. అధికారుల్లో జవాబుదారీతనం పూర్తిగా కొరవడింది. ఏఒక్క అధికారి అందుబాటులో ఉండక గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు తమను అడిగేవారు లేరనే దీమాతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.
– గాదె శ్రీనివాసాచారి, ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా ఉపాధ్యక్షుడు, తిమ్మంపేట
ప్రత్యేక పాలన
ప్రత్యేక పాలన


