
ముగిసిన హేమాచలుడి బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈనెల 8 నుంచి ప్రారంభమైన లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు (జాతర) గత పది రోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణం సత్యనారాయణ ఆధ్వర్యంలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా జరిపించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు నృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక గజవాహన పల్లకీ సేవపై ఉంచి వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని యాగశాల నుంచి మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పల్లకిపై ఆలయ పురవీధుల్లో వసంతోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా యాగ్నిక పూజారులు సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ భక్తులపై రంగులను చిలకరిస్తూ ఆనందం నడుమ వసంతోత్సవాన్ని నిర్వహించారు. అనంత రం ఆలయ ప్రాంగణంలోని ర మాసమేత సత్యనారాయణస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతర చివరిరోజు భక్తులకు పలువురు దాతలు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు శేఖర్ శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర్ చందు శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డ్ అసిస్టెంట్ గోనె లక్ష్మీనారాయణ, సిబ్బంది శివరాజు శేషు, నూతల కంటి అజయ్, నవీన్, గొల్లపల్లి గణేశ్, బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేశ్, వేమ రవి, దామెర సారయ్య, చందర్లపాటి శ్రీనివాస్, అనిత ఉన్నారు.

ముగిసిన హేమాచలుడి బ్రహ్మోత్సవాలు