ప్రధాని మోదీకి సుశాంత్‌ సోదరి విజ్ఞప్తి

Sushant Singh Rajput Sister Shweta Writes to PM Modi To Look Into Case - Sakshi

మీరు సత్యం వైపే నిలబడతారని నా మనసు చెబుతోంది.

పట్నా: తన సోదరుడి మరణంపై లోతుగా దర్యాప్తు జరిపించాలని బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తమకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని పారదర్శక విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు శనివారం శ్వేత ట్విటర్‌లో ఓ లేఖను షేర్‌ చేశారు. ‘‘మీరు సత్యం వైపే నిలబడతారని నా మనసు చెబుతోంది. మేం చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాం. నా సోదరుడికి బాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్‌ లేరు. మా పరిస్థితి కూడా అదే. మీరు ఈ విషయాన్ని పరిశీలించి.. సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, పారదర్శంగా విచారణ జరిపించాలని అభ్యర్థిస్తున్నాను. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. (సహ జీవనం.. జూన్‌ 8 వరకు తనతోనే: రియా)

‘‘నేను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరిని. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.  మాకు న్యాయం కావాలి’’అంటూ ప్రధాని మోదీ, ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు. కాగా జూన్‌ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. డిప్రెషన్‌తో అతడు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తొలుత బాలీవుడ్‌ పెద్దలపై బంధుప్రీతి ఆరోపణల చుట్టూ తిరిగిన కేసు.. సుశాంత్‌ తండ్రి.. నటి, సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిపై పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీలక మలుపు తిరిగింది. డబ్బుకోసమే సుశాంత్‌ను వాడుకుని వదిలేసిందంటూ రియాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్పందించిన రియా.. తను సుశాంత్‌తో సహజీవనం చేసిన విషయం వాస్తమేనని, జూన్‌ 8 వరకు తనతో ఉన్నానంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొనడంతో వీటికి మరింత బలం చేకూరింది.(సంచలన ఆరోపణల నేపథ్యంలో రియా స్పందన)

అంతేగాక రియాకు సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రూ. 15 కోట్ల మేర బదిలీ అయ్యాయన్న ఫిర్యాదుపై దృష్టి సారించిన ఈడీ.. ఆమెపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఇక ఈ విషయంలో సుశాంత్‌ కుటుంబానికి అండగా నిలిచేందుకు బిహార్‌ ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతమంది నుంచి ఒత్తిడి వచ్చినా ఈ కేసును సీబీఐకి అప్పగించమని కోరే అవకాశం లేదని మహారాష్ట్ర సర్కారు తేల్చిచెప్పడం సహా, ఇందుకు సంబంధించి ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో.. ప్రస్తుతం సుశాంత్‌ సోదరి శ్వేత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడం గమనార్హం. (లవ్‌ యూ.. ఇక్కడికి వచ్చెయ్‌.. సరే అక్కా!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top