
సాక్షి,చెన్నై: నటి రష్మిక మందన్నాపై ఐరన్ లెగ్ నటి అనే ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. సినీ లోకం చాలా విచిత్రమైనది. ఇక్కడ ఏం జరిగినా దానిని నటీనటులకు అంటగట్టేస్తారు. శిలువలు, పలువలు అల్లేసి ప్రచారం చేసేస్తారు. వరుసగా రెండు హిట్స్ వస్తే ఆ చిత్ర హీరో హీరోయిన్లును స్టార్స్‌ను చేస్తూ పొగిడేస్తారు. అదే ఒక చిత్రం ప్లాప్ అయితే అమాంతం కిందకి దించేస్తారు. ఇలాంటి వాటిని అధిగమించి రాణిస్తున్న వారూ ఉన్నారు. అది వేరే సంగతి. శాండల్‌వుడ్ నుంచి ఇతర పరిశ్రమలకు దిగుమతి అయిన రష్మిక మందన్నా ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోంటోంది.
మాతృభాషలో రెండు, మూడు చిత్రాలు చేసిన ఈమెకు సోలో చిత్రం ద్వారా టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఆ చిత్రం హిట్ అనిపించుకోవడంతో ఆ తరువాత ఈ అమ్మాయికి తెలుగు చిత్ర పరిశ్రమ బ్రహ్మరథం పడుతోంది. అక్కడ టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలిగిపోతుంది. అల్లుఅర్జున్‌తో కలిసి నటించిన పుష్ప చిత్రం హిందీలోనూ బంపర్‌హిట్ అయ్యింది. దీంతో బాలీవుడ్ దృష్టి రష్మిక మందన్నాపై పడింది. అంతే వెంట వెంటనే అక్కడ నాలుగు చిత్రాలకు రష్మిక సైన్ చేసేసింది. అలా అమితాబచ్చన్‌తో గుడ్ బై, సిద్ధార్థ మల్హోత్ర సరసన మిషన్ మజ్ను చిత్రాల్లో నటించి పూర్తి చేసింది.
ప్రస్తుతం రణవీర్‌సింగ్‌కు జంటగా యానిమల్ అనే చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా నటుడు టైగర్ ష్రాఫ్ సరసన కరణ్‌జోహార్ నిర్మించే చిత్రానికి కమిట్ అయ్యింది. అయితే ఈ చిత్రమే రష్మికకు ఐరన్‌లెగ్ ముద్ర వేయడానికి కారణంగా మారింది. భారీ బడ్జెట్ విషయాల కారణంగా ఈ చిత్ర నిర్మాణాన్ని కరణ్ జోహార్ నిలిపేశారు. హిందీలో ఒక చిత్రం కూడా విడుదల కాకుండానే తాను అంగీకరించిన చిత్రంతో డ్రాప్ అవడంతో రష్మికపై ఐరన్‌లెగ్ ముద్ర ట్రోలింగ్ అవుతోంది.
ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల రిజల్ట్స్ అటు ఇటుగా అయితే ఈ అమ్మడి బాలీవుడ్ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.ఆ మధ్య కార్తీకి జంటగా సుల్తాన్ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టినా, ఆ చిత్రం ఆమె కెరియర్‌కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయితే తాజాగా వారీసు చిత్రంలో నటుడు విజయ్‌తో రొమాన్స్ చేస్తుంది. ఈ మూవీ రిజల్ట్స్ ఇక్కడ ఆమె ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు.