మేమిద్దరం మంచి స్నేహితులం.. మా నాన్న ఇల్లు అమ్మి డబ్బు ఇచ్చారు..

Police Complaint Against Nawazuddin Siddiqui Wife Aaliya Siddiqui - Sakshi

Nawazuddin Siddiqui Wife Aaliya Siddiqui: విలక్షణ పాత్రలతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. పాజిటివ్, నెగెటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్నాడు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. సీరియస్‌ మెన్‌ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఎమ్మీ అవార్డ్‌కు సైతం నామినేట్‌ అయిన నవాజుద్దీన్‌.. థాక్‌రే, మాంటో, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపూర్‌, భజరంగీ భాయిజాన్, బదలాపూర్‌, మాన్‌సూన్‌ షూట్‌ అవుట్‌ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా నవాజుద్ధీన్‌ భార్య ఆలియా సిద్దిఖీపై కేసు నమోదైంది. 

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రస్తుతం 'హోలీ కౌ' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి నవాజుద్దీన్‌ సతీమణి ఆలియా సిద్దిఖీ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మంజు అగర్వాల్‌ అనే యువతి నుంచి ఆలియా రూ. 31 లక్షలను అప్పుగా తీసుకుందని, తర్వాత అడిగితే సరిగ్గా స్పందింట్లేదని తెలుస్తోంది. దీంతో జూన్‌ 20న అంబోలి పోలీస్‌ స్టేషన్‌లో మంజు అగర్వాల్‌ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

''ఆలియాతో నాకు 2005 నుంచి పరిచయముంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె చాలా కాలం నుంచి నిర్మాతగా మారాలని ఎదురుచూస్తోంది. ఇక పరిస్థితులు అనుకూలించడంతో 'హోలీ కౌ' చిత్రంతో నిర్మాతగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రియేటివ్‌ పనులు చూసుకోమ్మని, ఆర్థిక విషయాలను ఆమె చూసుకుంటానని చెప్పింది. దీంతో నటీనటుల విషయాలను నేను చూసుకున్నాను. కానీ వారికి చెల్లించాల్సిన చెక్కులు కొంతకాలానికే బౌన్స్‌ అయ్యాయి. దీంతో ఆలియాకు కొంచెం డబ్బులు అవసరం కావడంతో మా నాన్నను అడిగింది. ఉజ్జయినిలోని ఓ ఇంటిని అమ్మి ఆమెకు డబ్బు ఇచ్చారు మా నాన్న. నెల రోజుల్లోనే తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆమె డబ్బు తిరిగి ఇవ్వలేదు'' అని మంజు అగర్వాల్‌ పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top