రాజమౌళికే సవాల్‌! అంచనాలను ముంచేసిన ‘రామాయణ’ | Ramayana Vs Varanasi, Which Film Will Deliver Bigger Visual Spectacles Amid Global IMAX Face Off, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

Ramayana Varanasi: వారణాసిపై పెరిగిన అంచనాలు.. రాజమౌళి విజన్‌కు పరీక్ష..

Oct 16 2026 3:51 PM | Updated on Oct 16 2026 4:30 PM

Global Imax Face Off How Ramayana Stunner Visuals Set A Benchmark For Mahesh Varanasi

భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న రెండు భారీ చిత్రాలు ‘రామాయణ’, ‘వారణాసి’. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నితీష్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘వారణాసి’ ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ఈ రెండు చిత్రాల నేపథ్యాలు, నిర్మాణ స్థాయి వేర్వేరైనా.. విజువల్‌ ఎఫెక్ట్స్‌, భారీతనం విషయంలో ఏది ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.

అదిరిపోయిన రామాయణ ట్రైలర్‌..
రామాయణ ఇతిహాసం ఆధారంగా నితీష్‌ తివారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. తొలి భాగాన్ని ఈ ఏడాది నవంబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

(ఇదీ చదవండి: ‘జైలర్‌2’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌? స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?)

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్లలోని భారీ సెట్స్‌, యుద్ధ సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించాలనే ప్రయత్నం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా రామాయణంలోని కీలక ఘట్టాలను ఎంత భారీస్థాయిలో చూపించబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.

జక్కన్న విజన్‌కు పరీక్ష
మరోవైపు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై కూడా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. మహేశ్‌బాబు ఇందులో రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథాంశం, పాత్రల వివరాలపై మరిన్ని స్పష్టతలు రావాల్సి ఉంది.

రాజమౌళి సినిమాల్లో కథతోపాటు విజువల్స్‌, భావోద్వేగాలు, యాక్షన్‌ సన్నివేశాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఈసారి మహేశ్‌బాబుతో కలిసి ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ‘వారణాసి’ని 2027 ఏప్రిల్‌ 7న విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

వారణాసిపై పెరిగిన అంచనాలు
‘రామాయణ’లోని పాత్రలు, యుద్ధాలు, పౌరాణిక ప్రపంచం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘వారణాసి’లో రాజమౌళి తనదైన కథన శైలి, భారీ యాక్షన్‌, విజువల్‌ వైభవంతో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తారన్నది చూడాలి. ఇప్పటివరకు విడుదలైన సమాచారం ఆధారంగా ఏ సినిమా విజువల్స్‌ మెరుగ్గా ఉంటాయో తేల్చడం తొందరపాటే.  జక్కన్న తనదైన మేకింగ్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో తెలియాలంటే సినిమా నుంచి వచ్చే తదుపరి అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూడాల్సిందే.

(ఇదీ చదవండి: నాదే తప్పు.. నేనే విషం తాగుతా: బిగ్‌బాస్‌ నరేశ్‌)


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement