
వన మహోత్సవ లక్ష్యం సాధించాలి
డీఆర్‌డీఓ శ్రీనివాసరావు
చిలప్‌చెడ్(నర్సాపూర్): వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని డీఆర్‌డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జగ్గంపేటలో ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న పౌల్ట్రీ షెడ్డుతో పాటు నర్సరీని, రహీంగూడలో జరుగుతున్న పంట కాలువ పనులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్‌లో నిర్వహించే వన మహోత్సవంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తప్పనిసరిగా 5 వేల మొక్కలు నాటాలన్నారు. అర్హులైన ప్రతి ఉపాధి కూలీకి పని కల్పించాలన్నారు. ఉపాధి పనులలో ప్రతీ రోజు తప్పనిసరిగా రెండుసార్లు హాజరు తీసుకోవాలని ఆదేశించారు. కూలీలకు త్వరగా డబ్బులు ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ సాయిబాబా, ఎంపీడీఓ ఆనంద్, ఏపీఓ శ్యాం, ఇన్‌చార్జి ఎంపీఓ తిరుపతి, ఈసీ భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలప్‌చెడ్ ఐకేపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న పదాధికారులకు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. స్వశక్తి సంఘాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి చూపించాలని వివరించారు.