
ఎకో మిత్రం.. ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని అభివృద్ధి పర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జాతీయ విద్యార్థుల పర్యావరణ (ఎన్‌ఎన్‌పీసీ) క్విజ్ పోటీని ‘హరిత్–ది వే ఆఫ్ లైఫ్’అనే నినాదంతో కేంద్ర విద్యాశాఖ, పర్యావరణ శాఖలు నిర్వహించనున్నాయి. సమాజంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, తగ్గిపోతున్న వన సంపదను పెంచడంతో పాటు విద్యార్థులు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఈనెల 24న కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆవిష్కరించారు.
జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్
ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు విద్యార్థులు, యువకులు జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ’ఈకో మిత్రమ్’ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. విద్యార్థుల ఆన్‌లైన్ నమోదుకు ఎలాంటి ఫీజు ఉండదు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న, వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీకి కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహాయ సహకారం ఉంది. ఫలితాలు ఆగస్టు 30న ప్రకటిస్తారు.
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు..
విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ఈ పోటీలు కొనసాగనున్నాయి. జిల్లాకు చెందిన 1వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు, ఇతర సామాన్య పౌరులు కూడా పాల్గొనవచ్చు. వీరిని గ్రూపుల వారీగా విభజిస్తారు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి ఈ–సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యా సంస్థలకూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుంది. హిందీ, ఇంగ్లీష్, మరిన్ని భాషలలో క్విజ్ పోటీ ఉంటుంది.
పర్యావరణంపై విద్యార్థులకు క్విజ్ పోటీలు
జూలై 1 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
ప్రతిభ గల వారికి ఈ–సర్టిఫికెట్
ఐదు విభాగాలలో పోటీ
ఈ ఏడాది మరింత ఎక్కువ మంది విద్యార్థులను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తాం. పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి

ఎకో మిత్రం.. ఆహ్వానం