
వరుస చోరీలు.. ప్రజలు బెంబేలు
నర్సాపూర్‌లో తాజాగా ఓ సిమెంట్ దుకాణంలో చోరీ
నర్సాపూర్: నర్సాపూర్‌లో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలు పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణంలో వరుసగా ఐదోరోజు కూడా మూడు చోట్ల చోరీలు జరిగాయి. పట్టణంలోని చౌరస్తా సమీపంలోని యాదాగౌడ్‌కు చెందిన శ్రీనివాస స్టీల్ అండ్ సిమెంటు దుకాణంలో బుధవారం రాత్రి దొంగలు చొరబడి కౌంటర్‌లో ఉన్న రూ.6 వేలు ఎత్తుకెళ్లారు. ఇక మెయిన్‌రోడ్డుపై ఉన్న హైదర్‌బేగ్ కాంప్లెక్స్‌లోని లైఫ్ కేర్ మెడికల్ హాల్ తాళం ధ్వంసం చేసి లోపలికి వెళ్లి దుకాణంలో ఉన్న రూ.4 వేలు పట్టుకుపోయారు. అదే కాంప్లెక్స్‌లో ఉన్న ఓ క్లినిక్ లోపలికి చొరబడి కౌంటర్‌లో ఉన్న రూ.3,900లను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఆయా దుకాణాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చోరీలు జరిగిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో రాత్రివేళల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని, చోరీ ముఠాలను వెంటనే పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలో పట్టుకుంటాం: సీఐ జాన్‌రెడ్డి
చోరీలకు పాల్పడుతున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. తమ సిబ్బంది రాత్రివేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలి. చోరీ ఘటనల్లో ఆధారాలు సేకరించాం. పాత రికార్డులతో సరి చూస్తున్నాం, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆయన వివరించారు.