
కేజీబీవీలకు మంచి రోజులు!
కేజీబీవీ మంజూరైన నిధులు ( రూ.లక్షల్లో)
రేగోడ్ 21.690
అల్లాదుర్గం 3.856
చేగుంట 3.856
చిప్పల్‌తుర్తి 7.712
చిట్కుల్ 23.136
కొల్చారం 2.410
మెదక్ 26.992
పాపన్నపేట 3.856
రామాయంపేట 2.410
పెద్దశంకరంపేట 28.438
చిన్నశంకరంపేట 3.856
శివ్వంపేట 26.992
టేక్మాల్ 3.856
తూప్రాన్ 3.856
వెల్ధుర్తి 2.410
జిల్లాలోని 15 స్కూళ్లలో
మరమ్మతులు
● మొదటి విడతగా రూ.1.65 కోట్లు మంజూరు
● అన్నీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1.65 కోట్లు మంజూరు చేసింది. దీంతో విద్యార్థినులకు మౌలిక వసతులు సమకూరనున్నాయి.
–రామాయంపేట(మెదక్)
జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలుండగా, వీటిలో తొమ్మిది పాఠశాలల్లో ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఈస్కూళ్లలో గత ఐదారేళ్లుగా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా నిధులు మంజూరు కాలేదు. తాజాగా ఈ స్కూళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గాను ప్రభుత్వం మొదటి విడతగా రూ. కోటి 65 లక్షలు మంజూరు చేసింది.
చేపట్టనున్న పనులు ఇవే..
జిల్లాలోని 15 స్కూళ్లలో చిన్నా, పెద్ద మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వీటితో విద్యుత్ పరంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించనున్నారు. పలు స్కూళ్లలో విద్యార్థులకు వేడినీరు అందించే సోలార్ యంత్రాలు చెడిపోగా, ఈ నిధులతో వాటికి మరమ్మతులు చేయించనున్నారు. అలాగే నీటి సరఫరా పైపులైన్లతో పాటు పాక్షికంగా శిథిలమైన వాటర్ ట్యాంకులు రిపేర్ చేయనున్నారు. వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతులకు ఈ నిధులు కేటాయించనున్నారు. పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణతో పాటు సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించనున్నారు. అలాగే ఇతర అత్యవసర పనులకు, మైనర్ రిపేర్లకు, డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. 7 పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు ప్రారంభించడంతో గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లకు అదనంగా మరికొన్ని నిర్మించనున్నారు.
విద్యార్థినుల బాధలు తీరినట్లే..
జిల్లావ్యాప్తంగా అన్ని కేజీబీవీ ల్లో మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వీటితో దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇక విద్యార్థినుల బాధలు తీరినట్లే. త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
– రాధాకిషన్, జిల్లా విద్యాధికారి

కేజీబీవీలకు మంచి రోజులు!