
భూ సమస్యలకు మోక్షం!
మెదక్‌జోన్: ఏళ్ల తరబడి భూ సమస్యలతో సతమతం అవుతున్న అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 15లోపు గ్రామ సభల్లో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొంది. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది.
జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 4 లక్షల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉన్నాయి. కాగా భూ సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన నూతన భూ భారతి చట్టంలో భాగంగా ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులోభాగంగా జిల్లాలో 37,817 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్ల దరఖాస్తులు 8,386 రాగా, అసైన్మెంట్ భూములకు సంబంధించి 7,001, సాదాబైనామాల దరఖాస్తులు 6,500 వచ్చాయి. మిగతా 15,930 దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని ఆగస్టు 15వ తేదీ వరకు పరిష్కరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో జిల్లా అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నా రు. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
కొనసాగుతున్న సర్వేయర్ల శిక్షణ
జిల్లావ్యాప్తంగా 219 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో మొదటి విడతగా 116 మంది సర్వేయర్లకు మే 26 నుంచి శిక్షణ ప్రారంభించారు. ఇది జూలై 26 వరకు కొనసాగనుంది. అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక 2వ విడతలో 113 సర్వేయర్లకు ఎప్పటి నుంచి శిక్షణ ఇస్తారనేది ఇంకా షెడ్యూలు రాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గతంలో పనిచేసిన వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు దరఖాస్తు చేసుకుంటే గ్రామ రెవెన్యూ అధికారులుగా నియమిస్తామని ప్రకటించటంతో జిల్లా వ్యాప్తంగా 104 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గత నెలలో పరీక్ష నిర్వహించగా కేవలం 47 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. కానీ, వీరికి ఇప్పటివరకు ప్రభుత్వం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.
ఆగస్టు 15లోపు పరిష్కరించేందుకు సన్నాహాలు
కొనసాగుతున్న దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ
జిల్లావ్యాప్తంగా 37 వేలకు పైగా అర్జీలు
ఇది నిరంతర ప్రక్రియ
భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులకు త్వరలో పరిష్కారం చూపుతాం.
–నగేష్, అదనపు కలెక్టర్

భూ సమస్యలకు మోక్షం!