
నిబద్ధతతో పనిచేస్తే రివార్డులు
రామాయంపేట/నిజాంపేట/చేగుంట/చిన్నశంకరంపేట: విధి నిర్వహణలో అలసత్వం తగదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట, చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెట్రోలింగ్, సీసీ కెమెరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో విధులను నిర్వర్తించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల చోరీలు పెరగడంతో నిఘా పెంచాలన్నారు. నిబద్ధతతో పనిచేసేవారిని ప్రోత్సహించి రివార్డులు అందజేస్తామని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే ప్రతి శుక్రవారం తనకు నేరుగా సంప్రదించాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకట రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పర్చుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: ఉన్నత విద్య అభ్యసించిన వారే పోలీసు ఉద్యోగంలోకి వస్తున్నారు..ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఙానాన్ని మెరుగుపర్చుకొని సైబర్ నేరాలను అరికట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్టేషన్‌ల వారీగా కేటాయించిన సైబర్ వారియర్లతో సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. సైబర్ బాధితుల పట్ల త్వరితగతిన స్పందించి సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదును నమోదు చేయాలని ఆదేశించారు. డబ్బులను త్వరితగతిన ఆపే విధంగా కృషి చేయాలన్నారు. సాంకేతికత పూర్తి నైపుణ్యాన్ని కలిగి ఉండాలని, నేరస్తులకు తగు శిక్షలు పడే విధంగా కృషి చేయాలన్నారు. అప్పుడే ఇలాంటి నేరాలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌గౌడ్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం
పలు పోలీస్టేషన్ల ఆకస్మిక తనిఖీ