
ఇన్వెస్టిగేషన్ టూల్‌గా సైన్స్
● నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ● కమిషనరేట్‌లో బాసర జోన్ – 2 పోలీస్ డ్యూటీ మీట్ ● హాజరైన నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ పోలీసులు
ఖలీల్‌వాడి: మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్‌ను ఇన్వెస్టిగేషన్ టూల్‌గా మార్చుకోవాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సిబ్బందికి సూచించారు. జోన్ – 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీమీట్ – 2025ను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ బుధవారం ప్రారంభించారు. విధి నిర్వహణ సామర్థ్యం పెంచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న మీట్‌లో మూడు రోజులపాటు డిపార్ట్‌మెంటల్ పోటీలు కొనసాగనుండగా, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయి పెరుగుతుందని, పనిలో పోటీతత్వం అలవడుతుందన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫొరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ ఎంపికల్లో భాగంగా నేరం జరిగిన చోట శ్రీక్లూస్‌శ్రీ సేకరణకు సంబంధించి పరీక్షను మొదటి రోజు నిర్వహించామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్‌కు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి (అడ్మిన్), రామ్‌చందర్‌రావు(ఏఆర్), సీసీఎస్ ఏసీపీ నాగవేంద్రచారి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సీఐలు, ఏఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.