
విద్యాప్రమాణాల మెరుగుకు ప్రత్యేక ప్రణాళిక
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజన విద్యా ప్రమాణాల మెరుగు పరచడానికి ఐటీడీఏ ఎడ్యుకేషన్ విజయ్–2035 ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం పీఎంఆర్‌సీ ఉట్నూర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల సమావేశానికి హాజరై మాట్లాడారు. రాబోయే పదేళ్లలో డ్రాపౌట్లు లేకుండా వందశాతం విద్యార్థుల నమోదుతో నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పది రోజుల్లో ఆశ్రమ పాఠశాలలకు 80 శాతం విద్యార్థులు హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం ఐటీడీఏ ఎడ్యుకేషన్ విజన్ 2035 లోగో ప్రతులను ఆవిష్కరించారు. గతేడాది పదో తరగతిలో వందశాతం ఫలి తాలు సాధించిన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడీలు జాదవ్ అంబాజీ, రమాదేవి, డీటీడీవో జనార్దన్, ఏసీఎంవోలు జగన్, ఉద్దవ్, శివాజీ, జీజీడీవోలు చాయ, శంకుంతల, జిల్లా క్రీడా అధికారి పార్థసారథి పాల్గొన్నారు.