
రోజంతా ముసురు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ముసురు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వర్షంతోపాటు చల్లగాలి వీయడంతో వృద్ధులు, చిన్నారులు వణుకుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షంతో పత్తి మొలకలు ప్రాణం పోసుకుంటున్నాయి. భారీ వర్షాలు లేక, వాగులు, వంకల్లో ప్రవాహం లేదు. చెరువులు, కుంటల్లోకి కొత్త నీరు చేరలేదు. జూలైలో ఆశించిన వర్షాలు కురుస్తాయని రైతులు ఆశత ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో నమోదైన వర్షపాతం..
జిల్లాలో అదివారం నుంచి సోమవారం వరకు 13.9 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. భీమినిలో 26.1 మిల్లిమీటర్లు, కన్నెపల్లిలో 24, కోటపల్లిలో 22.8, వేమనపల్లిలో 22.5, నెన్నెలలో 20.2, చెన్నూర్‌లో 17.7, బెల్లంపల్లిలో 17.2, తాండూర్‌లో 14.2, భీమారంలో 13.2, మందమర్రిలో 12.8, జైపూర్‌లో 12.4, మంచిర్యాలలో 12, నస్పూర్‌లో 10.5, కాసిపేటలో 8.3, హాజీపూర్‌లో 7.7, దండేపల్లిలో 4.9, లక్షెట్టిపేటలో 3.2, జన్నారంలో 1.1 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. జిల్లా జూన్ 30 వరకు సాధారణ వర్షపాతం 159.8 మిల్లిమీటర్లు కాగా, 95.7 మిల్లిమీటర్లు కురిసింది. సగటున 40 శాతం లోటు నెలకొంది.