
జీవన రేఖ.. వివక్షకు ప్రతీక
● నది నుంచి అటవీప్రాంతం వరకు.. ● విస్తరించిన బాసర–లక్సెట్టిపేట రోడ్డు ● నిర్మల్ జిల్లాలోనే అతిపెద్ద రహదారి ● దారి వెంట ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ● అబ్బురపరిచే చారిత్రక నిర్మాణాలు ● అయినా అభివృద్ధికి నోచుకోని వైనం
భైంసా: నిర్మల్ జిల్లాకు బాసర–లక్సెట్టిపేట రహదారి జీవన రేఖగా ఉంది. తూర్పు, పశ్చిమ జిల్లాలను కలుపుతూ 175 కిలో మీటర్ల మేర ఈ రహదారి వ్యాపించి ఉంది. రెండు జిల్లాలను కలిపే ఏకై క వారధి ఈ మార్గం అధికశాతం నిర్మల్ జిల్లాలోనే ఉంది. నిర్మల్ జిల్లాలో 125 కిలోమీటర్ల మేర విస్తరించి 13 మండలాల మీదుగా సాగి జిల్లాకు ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగపడుతోంది. ఈ రహదారి పొడవునా పరిసర ప్రాంతాల గొప్పతనం, చారిత్రక అంశాలెన్నో కనిపిస్తుంటాయి.
నది నుంచి అడవి వరకు..
బాసర వద్ద గోదావరి నది ఒడ్డు నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి అడవుల గుండా లక్సెట్టిపేట వరకు విస్తరించి ఉంది. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని చూస్తూ చదువుల తల్లి ఆశీస్సులు పొంది ఎంతోమంది ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారు. పక్కనే బిద్రెల్లి వద్ద మహారాష్ట్రలోకి ఓ మార్గం వెళ్తుంది. ఈ మార్గం గుండా భైంసా వరకు రెండు వైపులా వానాకాలంలో పత్తి చేల అందాలు చూడవచ్చు. వేసవిలో విస్తరించిన భూములు కనిపిస్తుంటాయి. భైంసా వద్ద మహారాష్ట్రకు వెళ్లే మరో జాతీయ రహదారి కనిపిస్తుంది. ఈ మార్గంలో పత్తి, సోయా పంటల లోడ్‌తో వెళ్లే వాహనాలు అధికంగా కనిపిస్తుంటాయి. మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ మార్గం మీదుగా వస్తుంటాయి.
13 మండలాల మీదుగా..
నిర్మల్ జిల్లాలో ప్రత్యక్షంగా ఎనిమిది మండలాలు, పరోక్షంగా 13 మండలాల గుండా ఈ మార్గం ముందుకు వెళ్తుంది. నిర్మల్ జిల్లా అంతటిని కలిపే ఈ మార్గం విస్తరణపై అధికారులు దృష్టి సారించడం లేదు. జిల్లాలో పెద్దదైన ఈ మార్గాన్ని మరింత అభివృద్ధి చేయాలి. తూర్పు, పశ్చిమ జిల్లాలను కలిపే ఈ మార్గంలో అడుగడుగునా ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఏళ్లుగా ఉన్న బాసర–లక్సెట్టిపేట మార్గంపై దృష్టిసారించాలని తూర్పు, పశ్చిమ జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ..
బాసర వద్ద సరస్వతీ అమ్మవారి ఆలయం నుంచి కుంటాల మండలం కల్లూరులో సాయిబాబా ఆలయం, కాల్వ వద్ద నరసింహస్వామి, కదిలి పాపహరేశ్వరస్వామి ఆలయాలకు ఈ మార్గం గుండా వెళ్లవచ్చు. అక్కడి నుంచి నిర్మల్ చారిత్రక కోటలను దాటుకుంటూ గొలుసుకట్టు చెరువులను చూస్తూ జిల్లా కేంద్రాన్ని ఈ మార్గం కలుపుతుంది. నిర్మల్ జిల్లా ధాన్యాగారంగా పిలువబడుతున్న లక్ష్మణచాందతోపాటు మామడ, ఖానాపూర్ మండలాల మీదుగా ఈ మార్గంవెళ్తుంది. మామడ మండలంలోకి వెళ్లగానే దారి మధ్యలో ఏపుగా పెరిగిన టేకు చెట్లు, దట్టమైన అరణ్యం కనిపిస్తుంటుంది. జిల్లాలో చివరగా ఖానాపూర్‌లో గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సదర్‌మాట్ గలగలలు వినిపిస్తూ కడెం నదికి పక్కనే ఈ మార్గం జన్నారం వైపు వెళ్తుంది. దస్తురాబాద్ నుంచి అభయారణ్యంలో నల్లతాచులా మెలికలు తిరిగి కవ్వాల్ అభయారణ్యంవైపు వెళ్తుంది. ఈ మార్గం పక్కనే కవ్వాల్ అభయారణ్యంలో లేడి పిల్లల పరుగులు, నీలుగాయిల ఉరుకులు, కుందేళ్ల కోలాహలం, పక్షుల కిలకిలలు చూసి మురిసిపోవాల్సిందే.