
విందు సరే.. విధుల మాటేంటి?
● ఖాళీగా ఆదిలాబాద్ బల్దియా ఇంజినీరింగ్ విభాగం
కై లాస్‌నగర్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొందరు ఆదిలాబాద్ బల్దియా అధికారులు, ఉద్యోగుల తీరు మారడం లేదు. ఇటీవల సెలవు పెట్టకుండా రెవెన్యూ ఉద్యోగులు మూకుమ్మడిగా కేరళకు విహారయాత్రపై వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చినవారు అవస్థలు పడ్డారు. తాజాగా శుక్రవారం బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగులు కనిపించకుండా పోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో తలుపులు మూసే ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు ఎక్కడికి వెళ్లారని శాఖ ఉద్యోగులను పలువురు అడగగా లాండసాంగ్విలో విందు చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. విధులు నిర్వహించే సమయంలో విందులో పాల్గొనడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. అడిగేవారు లేక వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోందని విమర్శలు గుప్పించారు. విందు చేసుకోవడం తప్పు కాదు గాని.. కార్యాలయ పనివేళల్లో మూకుమ్మడిగా వెళ్లడం ఏమిటని.. ఆయా పనుల కోసం కార్యాలయానికి వచ్చినవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌లో అధికారుల పర్యవేక్షణ గాడితప్పిందని, ప్రత్యేకాధికారి నియామకమైన నుంచి ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం, ఉన్న అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ తతంగం సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఉద్యోగులు ప్రతీరోజు సమయపాలన పాటించడం లేదని చెబుతున్నారు. అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును సంప్రదించగా.. లాండసాంగ్వి పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన దావత్‌కు వెళ్లారని పేర్కొనడం గమనార్హం.