
ఇన్‌స్టాగ్రామ్ వేధించిన యువకుడి అరెస్ట్
గుడిహత్నూర్: ఇన్‌స్టాగ్రామ్ ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఓ యువతిని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ ఓ మహిళ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మరో యువతి పరువు తీసేలా అసత్య ప్రచారం చేశాడు. విషయం తెలుసుకున్న సదరు బాధితురా లు షీటీంకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రాథమిక సాంకేతిక ఆధారాలు పరిశీలించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల మనో భావాలు దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.
రౌడీషీటర్ రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడకు చెందిన రౌడీషీటర్ కద్దుపై గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఈనెల 6న సాయంత్రం వినాయక్‌చౌక్‌లో బంగారుగూడకు చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు తనతో రావాలని వేధించాడు. మహిళతో ఉన్న ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు మహిళను వేధించిన కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో రౌడీషీటర్ కద్దు రెండు మర్డర్ కేసులతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వివరించారు.
అగ్నిప్రమాదంలో కొట్టం దగ్ధం
బోథ్: మండల కేంద్రంలోని సెరె గుండయ్యకు చెందిన కొట్టం బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో చేనులో మంటలు చెలరేగి కొట్టానికి అంటుకున్నాయి. గమనించిన స్థానిక రైతులు సమాచారం అందించడంతో వెళ్లి చూడగా అప్పటికే కొట్టం పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బాధిత రైతు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశాడు.