
డీడీలు చెల్లించాలని సూచిస్తున్న అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్
డీడీలు చెల్లించి ఇళ్ల పట్టాలు పొందాలి
రామకృష్ణాపూర్(చెన్నూర్): సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే డీడీలు చెల్లించి పట్టాలు పొందాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని డీడీలు చెల్లించని పలువురి ఇళ్లకు బుధవారం అదనపు కలెక్టర్‌తో పాటు ఇతర రెవెన్యూ అధికారులు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ నెలాఖరుతో గడువు ముగియనుందని, వెంటనే డీడీలు చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చన్నారు. ఆయన వెంట ఆర్డీవో వేణు, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
కాలువ నీటిలో గల్లంతై యువకుడు మృతి
దండేపల్లి(మంచిర్యాల): ప్రమాదవశాత్తు కాలువ నీటిలో గల్లంతై యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ముత్యంపేటకు చెందిన ఒర్సు మల్లేశ్ (22) బుధవారం సాయంత్రం మిత్రులతో కలిసి కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. లిఫ్టు డెలివరీ పాయింట్ సమీపంలోనే కాలువలోకి దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటిప్రవాహం ఎక్కువ రావడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గమనించిన మిత్రులు నీటిలో గాలించినా దొరకకపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్సై సాంబమూర్తి ఈతగాళ్ల సాయంతో కాల్వలో వెతికించగా మృతదేహం లభించింది. మృతదేహాన్ని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మల్లేశ్ మృతదేహం