వైభవం.. లక్ష్మీవేంకటేశ్వరుడి తెప్పోత్సవం
● శేష వాహనంపై ఊరేగిన ఆదిశిలావాసుడు
● పోటెత్తిన భక్తజనం
మల్దకల్: ఆదిశిలావాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను శేషవాహనంపై ఉంచి భాజాభజంత్రీలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో తెప్పోత్సవంపై విహరించారు. ఆయా వేడుకలను తిలకించేందుకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను శేషవాహనంపై దశమికట్ట వరకు ఊరేగించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, మండల నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్, చంద్రశేఖర్‌రావు, అర్చకులు, సిబ్బంది, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.
వైభవం.. లక్ష్మీవేంకటేశ్వరుడి తెప్పోత్సవం


