పాఠశాలలో క్షుద్ర పూజలు
కోస్గి: మండలంలోని మీర్జాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. 10వ తరగతి గది ఎదుట ముగ్గువేసి అందులో నిమ్మ, మిరపకాయలు ఉంచి పసుపు, కుంకుమ చల్లడంతో పాటు తరగతి గది తలుపునకు వేసిన తాళానికి బొట్లు పెట్టారు. బుధవారం ఉదయం పాఠశాలను శుభ్రం చేయడానికి వచ్చిన అటెండర్ కృష్ణయ్య గుర్తించి వెంటనే ప్రధానోపాధ్యాయుడు జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలంలో ప్రాథమిక విచారణ జరిపారు. డీఈఓకు సైతం సమాచారం ఇచ్చి ఎవరో ఆకతాయిలు ఇలా చేసి ఉంటారని విద్యార్థులకు సర్దిచెప్పి తరగతులు కొనసాగించారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.


