
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలు సమర్పించుకోవాలని సూచించారు. అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వాహనాల తనిఖీ
కర్నూలు (టౌన్): జిల్లాలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు వాహనచోదకులకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు సెఫ్టీ ఉల్లంఘనులపై చర్యలు తీసుకున్నారు. ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని హెచ్చరించారు. నంబర్ ప్లేటు లేకుండా వాహనాలు నడిపేవారి వారికి జరిమానాలు విధించారు.
నిలకడగా ఇన్‌ఫ్లో
హొళగుంద: తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో నిలకడగా ఉండటంతో ఆదివారం 19 గేట్లతోనే నీటి విడుదల చేస్తున్నారు. జలాశయానికి 72,490 క్యూసెక్కులు (ఇన్‌ఫ్లో) వచ్చి చేరుతుండగా ఒక్కో గేటును రెండున్నర అడుగుల మేర ఎత్తి 56,333 క్యూసెక్కులు నదికి, మరో 6 వేల క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీల కాగా.. ప్రస్తుతం 77.343 టీఎంసీల నీరు ఉంది.