
14 మండలాల్లో వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 14 మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా 6.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కౌతాళంలో 38.2 మి.మీ, కోసిగిలో 34.2, ఎమ్మిగనూరులో 27.8, నందవరంలో 17.8, సి.బెళగల్‌లో 13.6, పెద్దకడుబూరులో 12.2, కోడుమూరులో 8.2, మంత్రాలయంలో 7.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ ఉండగా.. మొదటి ఐదు రోజుల్లో 14.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా రానున్న నాలుగు రోజుల్లో వివిధ మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలుగుగంగ కాలువలకు గండ్లు
● పట్టించుకోని ప్రభుత్వం
● సొంత నిధులు వెచ్చించి
గండ్లు పూడ్చేందుకు యత్నిస్తున్న రైతులు
రుద్రవరం: మండల పరిధిలోని శ్రీరంగాపురం వద్ద 16వ బ్లాక్ ఉప ప్రధాన కాలువలో రెండు చోట్లా గండ్లు పడ్డాయి. గత రబీ సీజన్‌లో కాలువకు సాగునీరు విడుదల చేయడంతో నీటి ప్రవాహ ఉధృతికి రెండు చోట్లా గండ్లు పడి నీరు వృథాగా పంటలపై పారింది. అప్పట్లో రైతులు గండ్లను పూడ్చాలని తెలుగుగంగ అధికారులను కోరినా రబీ అయిపోయాకా వేసవిలో గండ్లను పూడ్చివేస్తామని చెప్పారు. అయితే గత రబీ సీజన్ పూర్తయ్యింది. వేసవి ముగిసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కానీ నేటి వరకు కూటమి ప్రభుత్వం గండ్లను పూడ్చలేదు. దీంతో ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న రైతులు.. సొంత ఖర్చులతో జేసీబీతో గండ్లను పూడ్చుకున్నారు. పంటలను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో సొంత నిధులతో గండ్లు పూడ్చుకుంటున్నామని రైతు మధు తెలిపారు.