
గంజాయి అక్రమ రవాణాపై పోలీసు నిఘా
కర్నూలు: నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో కర్నూలు రైల్వే స్టేషన్‌లో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీమ్, స్పెషల్ పార్టీ పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు, రైల్వే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు సంయుక్తంగా గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు రైల్వేస్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి ఉత్తరాఖండ్‌కు కర్నూలు మీదుగా వెళ్లే యశ్వంత్‌పూర్–యోగి నగరి రిషికేశ్ రైలు (ట్రైన్ నెం.06597)లో జనరల్ బోగి నుంచి ఏసీ బోగిల వరకు అన్నింటినీ తనిఖీ చేశారు. జిల్లాకు ఒక ట్రైన్‌ను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైల్వేస్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయాల్లో కూడా డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్ 1972ను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ తెలిపారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు నాగరాజరావు, గుణశేఖర్ బాబు, ఎస్‌ఐ సతీష్ కుమార్ యాదవ్ తదితరులు తనిఖీ బృందాలకు నాయకత్వం వహించారు.