ఆస్పరి/ఆదోని రూరల్: ఆదోని మండలం నాగనాథహళ్లి గ్రామ సమీపంలో మంగళవారం పిడుగు పడటంతో ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన శంకరబండ గోవిందు (33) అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ములుగుందం గ్రామానికి చెందిన గోవిందుతో పాటు మరోఆరుగురు కాపరులు నాగనాథహళ్లి గ్రామ సమీపంలో గొర్రెలను మేపేందుకు వెళ్లారు. మంగళవారం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. గొర్రెల వద్ద ఉన్న గోవిందుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య రంగవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గోవిందు మృతితో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ముత్తుకూరులో ఎద్దు మృత్యువాత
ఆస్పరి: మండలంలోని ముత్తుకూరు గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు కారుమంచి మల్లికార్జున రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. రైతు మల్లికార్జునరెడ్డి ఎద్దులను వామిదొడ్డి వద్ద కట్టి ఉంచాడు. ఒక్కసారిగా ఉరుములు ఏర్పడి పిడుగు ఎద్దులపై పడడంతో ఒక ఎద్దు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఎద్దుకు స్వల్ప గాయాలయ్యాయని రైతు తెలిపారు. ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎద్దు మృతితో రూ.80 వేలు నష్టం వాటిల్లిందని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని కోరారు.