
అప్పులే ఉరితాడై..
● ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి
కర్నూలు: కుమారుడు చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో తండ్రి వెంకటేశ్వర్లు (50) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కర్నూలు పాతబస్తీలోని చిత్తారి వీధిలో నివసిస్తున్నాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న స్వర్ణ కార కాంప్లెక్స్‌లో బంగారు దుకాణం నడుపుతున్నాడు. ఈయన భార్య పద్మావతి ఐదు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉండేవాడు. ఈయన కొడుకు రాఘవేంద్ర బీటెక్ పూర్తి చేసి వెంకాయపల్లె వద్ద ఒక ఇంజినీరింగ్ కళాశాలలో పెయింగ్ గెస్ట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షలు వరకు అప్పు చేశాడు. ఈయన కూతురు హర్షవర్ధిని డెన్మార్క్‌లో చదువుతోంది. కొడుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, భార్య గుండెపోటుతో మృతిచెందడంతో ఈయన మనోవేదనకు గురై ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో వైర్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈయన తల్లి రామకోటమ్మ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుండగా వెంకటేశ్వర్లు రెండో అంతస్థులో ఉంటాడు. మధ్యాహ్నాం భోజనం కోసం తల్లి రామకోటమ్మ బెల్ కొట్టినప్పటికీ కొడుకు రాకపోవడంతో పైకెక్కి చూడగా ఉరికి వెళాడుతూ కనిపించాడు. ఇరుగు పోరుగు సాయంతో ఉరి నుంచి తప్పించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.