
సింహ వాహనంపై పాండురంగడు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, గణపతి పూజ, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి ప్రత్యేక అలంకరణలో పాండురంగడు సింహ వాహనంపై దర్శన మివ్వడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి శేషవాహనంపై దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.