
వైభవంగా నరసింహ జయంతి
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు, సూపరింటెండెంట్ రామ్ మోహన్‌రావు ఆధ్వర్యంలో వేదపండితులు జ్వాళా చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమద్దిలేటి నరసింహస్వామికి సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు, విశ్వక్సేనారాధన, నరసింహహోమం పంచామృత సహిత విశేష ద్రవ్య తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రంలో మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల మధ్య స్వామి, అమ్మవార్లను పల్లకీలో కొలువుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.